కొలువులో చేరిన కొత్తలో..

కొత్తగా ఉద్యోగంలో చేరారా? .. జాగ్రత్తగా మసలుకోవడం అవసరం. మీ ప్రతి కదలికనూ కొంతమంది గమనిస్తుంటారన్న సంగతిని మరవొద్దు. ఎలా పనిచేస్తున్నారు.. ఎలా ప్రవర్తిస్తున్నారు.. అన్న విషయాలను పరిశీలించి.. పూర్తిగా సంతృప్తి చెందితేనే పూర్తి స్థాయి కొలువులోకి తీసుకుంటారు.
ప్రస్తుత ఆర్ధిక సంక్షోభ సమయంలో ఉద్యోగం రావడం గొప్ప విషయమే. అంతవరకూ మీరు విజయం సాధించినట్లే. విజయం సాధించడంతోనే సరికాదు. దాన్ని నిలబెట్టుకోవడమూ ముఖ్యమే. సంస్థ నియమనిబంధనలను వీలైనంత త్వరగా తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ప్రతి సంస్థకూ ఓ ప్రత్యేక పని సంస్కృతి ఉంటుంది. దానికి త్వరగా అలవాటుపడాలి. సమయపాలన కచ్చితంగా పాటించాలి.
నోరు మంచిదైతే..: నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని సామెత. పనిచేసే చోట మీకు ఏది నచ్చకపోయినా కొన్నాళ్లపాటు విమర్శలు అనవరం. సీనియర్ల పనితీరు బాగోలేకపోయిన, సహచరుల ధోరణి నచ్చకపోయినా మాట్లాడకుండా మీ పని మీరు చేసుకుపోవడం ఉత్తమం. అందరితోనూ సత్సంబంధాలు ఏర్పర్చుకోవాలి. ఇతరుల వ్యక్తిగత విషయాల్లో అసలు తలదూర్చకూడదే. అవతలి వారి బలహీనతల గురించి వ్యాఖ్యానాలు అనవసరం.
సొంత సమస్యలొద్దు: మీకు వ్యక్తిగతంగా ఎన్ని సమస్యలైనా ఉండొచ్చు. వాటిని ప్రస్తావించొద్దు. ముఖ్యంగా మీ ఆర్ధిక సమస్యల గురించి అసలు మాట్లాడకూడదు. మీ బలహీనతను అది తెలియజేస్తుంది.
గొప్పలొద్దు: మీకు మిగిలినవారి కంటే మంచి విద్యార్హతలే ఉండొచ్చు. మీకు మంచి పరిగ్జ్నానం, నైపుణ్యం ఉండొచ్చు. వాటిని సందర్భం లేకుండా ప్రదర్శించాలని చూసినా, గొప్పలు చెప్పాలని ప్రయత్నించినా నష్టం మీకే. వాటి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సినా అవసరం లేదు. పనిలో మీరు చూపించే ఫలితమే మీ నైపుణ్యాలను తెలియజేస్తుంది.
వారితో జాగ్రత్త: ప్రతి సంస్థలోనూ సంతృప్తిచెందే వారూ, అసంతృప్తి ప్రకటించేవారు ఉంటారు. బహిరంగంగా అసంతృప్తి ప్రకటించేవారితో మసలుకునేటప్పుడు జాగ్రత్త. వారితో మీ సంభాషణ పని వరకు మాత్రమే ఉండాలి. అంతకు మించి ఒకమాట మాట్టాడినా మీకు నష్టం వాటిలవచ్చు.
చొరవ: మీరు ఉద్యోగానికి కొత్తకాబట్టి చేయాల్సన పని గురించి ఆమూలాగ్రం సవివరంగా చెబుతారు. అని ఊహించొద్దు. అరటిపండు వలిచి చేతిలో పెట్టినట్లు వివరిస్తే మంచిదే. లేనిపక్షంలో మీరే చొరవ తీసుకోవాలి. ఎవరూ నేర్పించడం లేదు. అని ప్రతికూలంగా ఆలోచించాల్సిన అవసరం లేదు. అని ప్రతికూలంగా ఆలోచించాల్సిన అవసరం లేదు. నేర్పించాలని ఉన్నా తీరిక ఉండకపోవచ్చు. సీనియర్ల పనిని ఆసక్తితో గమనిస్తూ నేర్చుకోవడానికి మీరే చొరవ తీసుకోవాలి. వారి పనికి అంతరాయం కలగకుండా లౌక్యంతో వ్యవహరిస్తూ సందేహాలు నివృత్తి చేసుకోవాలి.
బృందగానం: మీతోపాటు కొత్తగా ఉద్యోగంలో చేరిన వారు మరికొంతమంది ఉండోచ్చు. సీనియర్లకంటే వారితో ఎక్కువ స్వేచ్ఛగా మాట్లాడే వెసులుబాటు ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొండి. ఎప్పటికప్పుడు మీరు నేర్చకుంటున్న విషయాలను, ఇతర అనుభావాలను వారితో పంచుకోండి. వారి అనుభవాలను అడిగితెల్సుకోండి. దీనివల్ల నేర్చుకునే పరిధి పెరుగుతుంది.


  • సీనియర్లు పని విషయంలో ఒకమాట అన్నా.. అనుకున్న ఫలితం రాకపోయినా కొందరు కన్నీళ్లపర్యంతమవుతారు. మీరు ఆ కోవలో చేరొద్దు. మీ బలమీనతను అది తెలియజేస్తుంది.
  • అధికారికంగా కొన్ని పనివేళలుంటాయి. ఠంచనుగా అదే సమయానికి వెళ్లిపోవాలనుకోవద్దు. కెరియర్ ప్రారంభంలో ఎంత ఎక్కువ సమయం కేటాయిస్తే అంతమంచిది. పని తొందరగా ఒంటబడుతుంది. మీ విభాగం గురించే కాకుండా ఇతర విభాగాల గురించి కూడా అవగాహన పెంచుకుంటే మంచిది. అయితే ఇతర విభాగాల గురించి అవగాహన పెంచుకోవడానికి మీ పనివేళలను త్యాగం చేయరూడదు.
  • సహచరులు, సీనియర్లు, బాస్ తారసపడినప్పుడు గుడ్మార్నింగ్, గుడ్ ఈవెనింగ్ లాంటివి చెప్పడం మంచి పద్ధతి.
  • ఆడంబరంగా అనిపించాలని ప్రయత్నించొద్దు. హుందాగా కనిపిస్తే చాలు.
పూర్తిగా చదవటానికి క్లిక్ చేయండి...

రాయి వేసి చూస్తే తగలదు

ఉద్యోగ సాధన ఒక ప్రణాళికాబద్ద్గ ప్రక్రియ. ఇందులో వివిధ దశలుంటాయి. ప్రతి దశపైనా పూర్తిస్థాయిలో శ్రద్ధ ఛేదించుకుంటూ వెళ్లాలి. దరఖాస్తు చేశాం.ఇంటర్వ్యూ వస్తే వెళ్దామనో.. ఇంటర్వ్యూ వచ్చింది.. ఒక రాయివేసి చూద్దామనే ధోరణి ప్రస్తుత ఆర్ధిక మాంద్యం పరిస్థితుల్లో సత్ఫలితాలు ఇవ్వదు. ఉద్యోగసాధనలో ప్రధానంగా మూడుదశలుంటాయి. అవకాశాల గుర్తింపు, దరఖాస్తు, ఇంటర్వ్యూ.
అవకాశాల గుర్తింపు: చాలా మంది చేసే పని.. యాదృచ్ఛికంగా తారసపడిన ఉద్యోగాలకు దరఖాస్తు చేయడం. అవకాశాలను గుర్తించే పనిని ప్రత్యేకంగా చేపట్టాలి. ప్రతి రోజూ దీనికి కొంత సమయం కేటాయించుకోవాలి. ప్రతికల్లో ప్రకటనలు చూడాలి. జాబ్ సైట్లు చూడాలి. ఇటీవల కాలంలో పలు సోషల్ నెట్ వర్కింగ్ సైట్లు, కమ్యూనిటీ సైట్లు ఆన్లైన్లో దర్శనమిస్తున్నాయి. వాటిల్లో సభ్యులుగా ఉన్నవారు తమతమ కంపెనీల్లో ఉన్న ఖాళీల గురించి తెలియజేస్తున్నారు. వీలెనన్ని ఎక్కువ సోషల్ నెట్వర్కింగ్ సైట్లను చూడడం మంచింది. మీరు స్వయంగా ఎక్కవ మందితో పరిచయం పెంచుకోవడం వల్ల ఫలితముంటుంది. ఉద్యోగంలో స్థిరపడిన మీ సీనియర్లను ఎప్నటికప్పుడు వాకబు చేయడం వల్ల వారి కంపెనీల్లో ఉండే ఖాళీల గురించి తెలుస్తుంది. చాలా సంస్థలు రిఫరల్స్ ద్వారా ఎంపిక చేసుకుంటాయి. అంటే తమ కంపెనీలో పనిచేసేవారు ఎవరినైనా సిఫార్సు చేస్తే వారిని ఇంటర్వ్యూకు పిలుస్తరు. ముఖ్యంగా ఒకటో రెండో ఉద్యోగాలు మాత్రమే ఉన్నప్పుడు వాటిని బహి రంగంగా ప్రకటించరు. పరిచయాలు విస్తృతం చేసుకునే వారికి ఇది లబ్ధి చేకూరుస్తుంది. కనీసం రెండు రోజుల కొకసారైనా పరిచయస్తులందరినీ పలకరిస్తుంటే మాటల సందర్భంలోనే ఖాళీల వివరాలూ బయటకొస్తాయి.
దరఖాస్తు: దరఖాస్తు ప్రక్రియ మొక్కుబడిగా ఉండకూడదు. మీ తపన, ఆసక్తి దరఖాస్తులోనే తెలియాలి. దరఖాస్తులో రెండు ప్రధాన భాగాలుంటాయి. ఒకటి రెజ్యూమె, రెండు కవర్ లెటర్. రెజ్యూమెను తయారు చేయడంలోనూ శ్రద్ధ పెట్టాలి. ఇందులో నిజాయితీగా వ్వవహరించాలి. లేని నైపుణ్యాల గురించి ప్రస్తావించకూడదు. రెజ్యూమెలో తొలుత రాసేది ‘ఆబ్జెక్టివ్’.. అంటే లక్ష్యం. మీ లక్ష్యం ఏమిటో స్పష్టంగా రాయాలి. చాలా మంది ఈ అంశాన్ని సాధారణీకరించి రాసేస్తారు. మీ సంస్థలో ఫలానా ఉద్యోగం చేయడం నా లక్ష్యం అని సూటిగా ఉండకూడదు. మీరు దరఖాస్తు చేస్తున్న ఉద్యోగానికి పనికొచ్చే నైపుణ్యాలు అందులో కనిపించాలి. అక్షర, వ్యాకరణ దోషాలు లేకుండా ఒకటికి రెండుసార్లు జాగ్రత్తగా పరిశీలించి రాసేదే కవర్లెటర్. కవర్ లెటర్ క్లుప్తంగా ఉండాలి. పది వాక్యాలకు మించకుండా ఉంటే అది మంచి కవర్లెటర్. ఆ ఖాళీ గురించి మీకు సమాచారం ఎలా అందిందీ ప్రస్తావించాలి. మీ అర్హతలను ప్రస్తావించాలి. అర్హతల గురించి పూర్తి వివరాలు ఇక్కడ అవసరం లేదు. అవి రెజ్యూమెలో ఇవ్వాలి. ఆ ఉద్యోగంపై మీకున్న ఆసక్తిని తెలియజేయాలి. రెజ్యూమెను జతచేస్తున్నట్లు రాయాలి.
ఇంటర్వ్యూ: ఉద్యోగ సాధనలో ఇది కీలకదశ. ఇంటర్వ్యూ వరకూ వచ్చారంటే 70శాతం విజయం సాధించినట్టే. మిగిలింది 30శాతమే అయినప్పటికీ అదే కీలకం. మీరేమిటో పట్టేసేది ఇక్కడే. సరైన ఉద్యోగాన్ని ఆచితూచి మీరు ఎలా ఎంపిక చేసుకుంటారో, యాజమాన్యంకూడా సరిగ్గా అలాగే ఆచితూచి అభ్యర్ధిని ఎంచుకుంటుంది. మర్యాదలు, భావవ్యక్తీకరణ నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసం, విషయ పరిగ్జ్నానం, కలివిడితనం ఇంటర్వ్యూలో ముఖ్యంగా పరిశీలించే అంశాలు. అన్నింటికంటే ముఖ్యమైనది భావవ్యక్తీకరణ. మీకు విషయ పరిగ్జ్నానం ఎంత ఉన్నా దాన్ని తెలియచెప్పడానికి సరిపడా భాషా నైపుణ్యాలుండాలి. ఇంటర్వ్యూకు వెళ్లేటప్పటికే ఈ నైపుణ్యాలు మెరుగుపర్చుకోవాలి. రెజ్యూమెలో పేర్కొన్న అంశాలపైప పూర్తి వివరాలు అడుగుతారు. వాటిని స్పష్టంగా చెప్పాలి. అందుకే రెజ్యూమెలో లేని విషయాలు రాయకూడదు. ఉదాహరణకు మీకు అలవాటులేకపోయినా పుస్తకపఠనం మీ ఆసక్తి అని రాశారనుకోండి. ఇటీవల కాలంలో ఏ పుస్తకం చదివావు అని అడుగుతారు. నీళ్లు నమిలే పరిస్థితి వస్తే మైనస్ మార్కలు పడినట్టే. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత అక్కడ ధన్యవాదాలు తెలియచేయడంతోపాటు ఇంటికొచ్చాక ఈ మెయిల్ లోనూ ధన్యవాదాలు పంపండి.
పూర్తిగా చదవటానికి క్లిక్ చేయండి...