మార్పు మంచిదే!

వృత్తిప్రవృత్తుల్లో మార్పు ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఎదురవుతూనే ఉంటుంది. ఈ మార్పుని స్వీకరించడానికి కొందరు భయపడతారు. కొందరు మాత్రమే సంతోషంగా స్వాగతిస్తారు. మార్పు కూడా అంతే. కొందరిని మార్పు సంతోషపెడితే కొందరిని ఆందోళనకు గురిచేస్తుంది. అయినా సరే... అది తప్పదు. అలాంటప్పుడు దానికి అన్నివిధాలా సిద్ధంగా ఉండడం మనకే మంచిది కదా!
ఇల్లు మారవలసి రావచ్చు. బదిలీలకారణంగా ఊరే వదిలివెళ్లవలసి వస్తుంది. ఉద్యోగంలో బదిలీ, విభాగం మార్పు, పై అధికారి మార్పు, సహోద్యోగుల్లో మార్పులు... ఇలా ప్రత్యక్షంగా, పరోక్షంగా మార్పు మనని ప్రభావితం చేస్తూనే ఉంటుంది. 'అమ్మో.. కొత్త బాసు... ఎలా ఉంటారో', 'కొత్త ఉద్యోగం... చేయగలనో లేదో' ఇలాంటి సందేహాలు కొంత వేధించినా... నిజానికి మార్పనేది మనిషికి నూతనోత్తేజాన్ని ఇస్తుంది. కొత్త ఆశలు చిగురించేలా చేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మార్పనేది లేకపోతే అసలు జీవితంలో మజా ఉండదు. మార్పుని సాదరంగా స్వాగతించగలిగినవాళ్లే ఏదైనా సాధించగలుగుతారు.
 దేనికైనా సిద్ధం అన్నట్లుగా మనసుని సన్నద్ధం చేసుకోవాలి. అనవసరంగా నెగెటివ్‌ ఆలోచనలతో లేనిపోనివి వూహించుకుని ఆందోళనకు గురికాకూడదు.
 మార్పు మన మంచి కోసమేనని, కొత్త అవకాశాలు మన ముందుకొస్తాయని ఆశగా ఎదురుచూడాలి.
 మీ జీవితంలో వస్తున్న ఈ మార్పు గురించి సన్నిహితులకు, కుటుంబసభ్యులకు చెప్పండి. వారినీ అందుకు సిద్ధం చేయండి. ఈ మార్పు ద్వారా జరుగుతాయని మీరు ఊహిస్తున్న మంచి చెడులను వారితో చర్చించండి. ఎదురయ్యే అవరోధాలుగా మీరు భావిస్తున్న అంశాలగురించీ చెప్పండి. ముందుగా మాట్లాడుకుని ఉంటే సమస్యలను పరిష్కరించుకోవడం, మీరు దానికి అనువుగా మారడం తేలికవుతుంది.
 ఉద్యోగం మారాలనుకున్నప్పుడు మధ్యలో కొంతకాలం విరామం తీసుకుని, కొత్త ఉత్సాహంతో చేరడం సత్ఫలితాలనిస్తుంది.
 జీవితంలో ఎదురయ్యే ప్రతి మార్పూ మీలో వినమ్రతని, పరిణతిని పెంచాలి. అవకాశాలను దుర్వినియోగపర్చుకోకూడదన్న విషయం బోధపడాలి.
 మారిన ప్రతిసారీ మీ ప్రయత్నం మరింత ఎక్కువ మందికి సేవలందించగలిగేలా ప్రణాళిక వేసుకోవాలి. అప్పుడే సంతృప్తి లభిస్తుంది. మరో కొత్తమార్పునకు మనసు ఉవ్విళ్లూరుతుంది.
 మార్పుని మనలోనే కాదు... ఇతరులలోనూ స్వాగతించాలి.
మీలో మార్పు లేకపోయినా, బయటి నుంచి మార్పులు జరిగే అవకాశం ఉంది. యాజమాన్యం మారడం, కొత్త అధికారి రావడం లాంటివన్నమాట. అలాంటి దానికి మనని మనం సిద్ధంచేసుకోవడానికి ఎన్నిరకాలుగా సన్నద్ధమవాలంటే...
సునిశితంగా పరిశీలించాలి. నిదానమే ప్రధానం అన్నట్లుగా ఉండాలి. తొందరపడి ఏదీ చేయకూడదు. ఇతరులను ఇంప్రెస్‌ చేయడానికి కంగారుపడకూడదు. పాత యాజమాన్యం, అధికారి గురించి నెగెటివ్‌గా మాట్లాడకూడదు. మాటలు ఆచితూచి మాట్లాడాలి. యాజమాన్యం, అధికారి పనితీరుకు తగినట్లుగా మనం మన పనితీరును మార్చుకోవాలి. గతం గురించి, పాత ప్రణాళిక, పనిచేసే పద్ధతుల గురించి అడిగినమేర మాత్రమే సమాచారం ఇవ్వాలి తప్ప... మీకు తోచిందంతా చెప్పకూడదు. ఏవైనా వివరాలు అడిగితే కాగితం మీద గబగబా రాసి ఇవ్వకుండా చక్కగా ప్రింటవుట్‌ తీసివ్వండి. మీతో కాసేపు ప్రత్యేకంగా సంస్థ గురించి మాట్లాడాలన్నపుడు మీకు తోచిన మంచి ఆలోచనలు చెప్పండి. అంతేకానీ గతంలో ఇతరుల వైఫల్యాలను ఎత్తిచూపవద్దు. యాజమాన్యం ఏం కోరుకుంటోందో గమనించి తదనుగుణంగా మాట్లాడడం అవసరమన్నది ఇక్కడ కీలకం.

0 comments:

Post a Comment