ఏటా ఎంతోమంది యువతీయువకులు చదువులు ముగించుకుని ఉద్యోగాన్వేషణలో పడతారు. అలాంటివారిలో మీరూ ఒకరా? పైగా ప్రస్తుత పరిస్థితుల రీత్యా ఉద్యోగం లభించడం కష్టసాధ్యమే. ఈ నేపథ్యంలో మీ ప్రయత్నాలు సరైన దిశలోనే సాగుతున్నాయో లేదో తెలుసుకోవడం అవసరమే కదా!
ఉద్యోగాన్వేషణలో ఉన్నవారికి ఎదురయ్యే ప్రధాన అవరోధాలేమిటో, వాటినెలా అధిగమించాలో తెలుసుకుందాం.
తగిన సమయం కేటాయిస్తున్నారా? ఉద్యోగాన్వేషణ కూడా ఒక పూర్తిసమయం ఉద్యోగంలా చేయాలంటారు నిపుణులు. ఇంకా కళాశాలలో ఉండో, ఒక ఉద్యోగంలో ఉండి మరో మంచి అవకాశంకోసమో అన్వేషిస్తున్నట్లయితే మీకు చాలా తక్కువ సమయం ఉంటుంది. దాన్నయినా సరైన రీతిలో వాడుకుంటేనే ప్రయోజనం ఉంటుంది.
అందరికీ చెప్తున్నారా? నెట్‌వర్కింగ్ చేయనిదే ఈరోజుల్లో పనికాదు. ఎప్పుడూ ఒక రెజ్యూమె ప్రతిని మీతో ఉంచుకోండి. మీరు ఏ రంగంలో ఉద్యోగం కోసం అన్వేషిస్తున్నారో ఇతరులకు తెలియజేయండి. ముఖ్యంగా ఆ రంగంతో సంబంధం ఉన్నవారికి.
పత్రికలో ప్రకటనలు మాత్రమే చూసి దరఖాస్తు చేసి ఊరుకుంటున్నారా? ఇంటర్నెట్... ఇతరత్రా మార్గాలు కూడా అన్వేషిస్తున్నారా? ఎక్కడో ఒకచోటే వెదికితే సరిపోదు. అన్ని దారుల్లోనూ అన్వేషించాలి.
మీ నైపుణ్యాలేమిటో మీకు తెలుసు. అవి ఎక్కడ, ఎటువంటి సంస్థలకు అవసరమో కూడా తెలియాలి. ఆ సంస్థల్లో అవకాశాలకోసం ప్రయత్నించాలి. అక్కడ పనిచేసే ప్రముఖుల దృష్టిలో మీ నైపుణ్యాలు పడేలా అవకాశాలు ఆలోచించాలి. మీ నైపుణ్యాలు అవసరమైన సంస్థలను లక్ష్యంగా పెట్టుకుని ఉద్యోగాన్వేషణ చేస్తే పని సులువవుతుంది.
దరఖాస్తు పంపి ఊరుకుంటారా? ఫాలోఅప్ చేస్తారా? చాలామంది దరఖాస్తు పడేసి తమ పనైపోయిందనుకుంటారు. కానీ ఫాలోఅప్ తప్పనిసరి. దరఖాస్తు చేసిన విషయం గుర్తుచేస్తూ ఇంటర్వ్యూ ఎప్పుడు ఉండే అవకాశం ఉందో తెలియజేయమంటూ ఫోన్ చేయడమో, ఈ మెయిల్ పంపడమో చేయాలి. మూడునెలలైనా నా దరఖాస్తుకు అతీగతీ లేదేమిటని పోట్లాడకుండా, ప్రొయాక్టివ్‌గా మాట్లాడేవారికి త్వరగా అవకాశాలొస్తాయి.
అన్నిటికీ దరఖాస్తు చేస్తున్నారు. తగిన రీతిలో ఫాలోఅప్ కూడా చేస్తున్నారు. అయినా ఇంటర్వ్యూలకు పిలుపు రావడం లేదంటే... ఆలోచించాల్సిందే. పొరపాటు మీ రెజ్యూమె లోనో, కవరింగ్ లెటర్‌లోనో ఉంది. కాబట్టి ఒకసారి నిపుణుల సలహా తీసుకుని విశ్లేషించుకోవడం ఉత్తమం.
చాలా ఇంటర్వ్యూలకు కూడా వెళ్లారు కానీ ఉద్యోగం రాలేదా? అంటే అర్థం మీ ఇంటర్వ్యూ నైపుణ్యం మీద దృష్టిపెట్టాలని. కాబట్టి ఈ విషయంలోనూ నిపుణుల సలహాలు సూచనలు తీసుకోవడం, స్నేహితుల సహకారంతో మాక్ ఇంటర్వ్యూలు ఏర్పాటు చేసుకుని మెలకువలు నేర్చుకోవడం అవసరం.
ఇంటర్వ్యూ తర్వాత కూడా ఫాలోఅప్ చేయాలి. నియామకాలు ఎప్పటివరకు పూర్తవుతాయో సాధారణంగా చెప్తారు. ఆ గడువు వరకూ మీకు పిలుపు రాకపోతే ఒకసారి ఫోన్ చేసి మర్యాదగా అడగండి. అడిగేతీరు ఉద్యోగం పట్ల మీ ఆసక్తిని తెలియజేయాలి.
ఇంటర్వ్యూ అయ్యాక మీకు ఉద్యోగం ఇవ్వడంలేదని చెప్పారు. అప్పుడు మీరు చేసిన పొరపాటేమిటో అడిగారా? అడిగినా చాలామంది సూటిగా చెప్పరనుకోండి. కానీ ప్రయత్నించడంలో తప్పులేదు. ఇంటర్వ్యూ చేసిన సభ్యుల్లో ఎవరో ఒకరు మీ పట్ల సానుకూలంగా స్పందించినవారు ఉంటారు కదా. నెమ్మదిగా వారి ద్వారా ప్రయత్నించండి. ఒకటి రెండు అంశాలు తెలిసినా చాలు, తర్వాత ఇంటర్వ్యూకి ఇంకా బాగా సిద్ధమవడానికి. ఒకసారి తిరస్కారానికి గురి కాగానే ఆ సంస్థ పట్ల వ్యతిరేకత పెంచుకోకూడదు. 'నా ప్రతిభకు మరింత మెరుగు పెట్టుకుని ఎప్పటికైనా మీ ప్రతిష్ఠాత్మక సంస్థలో ఉద్యోగం సంపాదిస్తాను' అనే చెప్పండి వారితో. అది ఉద్యోగం పట్ల, ఆసంస్థ పట్ల మీ గౌరవాన్ని, ఆసక్తిని తెలియజేస్తుంది. తద్వారా తర్వాత అవకాశం మీకే రావచ్చు.




0 comments:
Post a Comment